విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖలో విమానయానానికి పూర్వ వైభవం వస్తున్న తరుణంలో ఇక్కడి నుంచి కీలక సర్వీసులు నిలిచిపోనున్నాయి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు రెండు సర్వీసులు ఇప్పటికే నిలిచిపోగా మేలో బ్యాంకాక్ (థాయ్‌లాండ్ థాయ్ ఎయిర్వేస్ ), కౌలాలంపూర్ (మలేసియా ఎయిర్ ఆసియా) సర్వీసులూ రద్దు కానున్నాయి. కొవిడ్ సమయంలో నిలిచిపోయిన దుబాయి సర్వీసు ప్రారంభం కాకపోగా ఉన్నవీ రద్దు కావవడంతో స్థానిక పారిశ్రామికవేత్తలు, నాయకులు, వివిధ వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పెరిగిన అంతర్జాతీయ ప్రయాణికులు రద్దీ: గణాంకాలను చుస్తే, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 74.4 శాతం పెరిగింది. 8,415 మంది మలేసియా, కౌలాలంపూర్, సింగపూర్‌కు రాకపోకలు సాగించారు. తాజాగా మే మొదటి వారం నుంచి ఈ సర్వీసులకు టికెట్ల బుకింగ్ నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఉమ్మడి విశాఖతోపాటు తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వారంతా హైదరాబాద్, చెన్నై వెళ్లి అక్కడి నుంచి బ్యాంకాక్, మలేసియాలకు ప్రయాణించాలి.
కూటమి ప్రభుత్వం వచ్చాక , విశాఖ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అంట అమరావతి అని ప్రచారం చేయడం, ఇప్పటికే పలు సంస్థ లను , అమరావతి గ్రామాలకు తరలించడం వల్లనే, ప్రయాణికులు తగ్గారని , ఆ కారణం చేతనే, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసెస్ ని రద్దు చేస్తున్నారు అని , ఇలా అయితే వేళా కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిరుపయోగం అవుతుంది అని పలువురు నిపుణులు అభిప్రాయం పడుతున్నారు

విజయవాడకు ఒక్కటే సర్వీసు: ఇది ఇలా ఉంటే, విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన నేపథ్యంలో గతేడాది అక్టోబరులో రెండు కొత్త సర్వీసులు ప్రారంభించారు. దీంతో ప్రతిరోజు నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఉదయం 2, సాయంత్రం ఒక సర్వీసు అందుబాటులో ఉండేవి. తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి. మిగిలిన రోజుల్లో విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వందే భారత్ రైలు అందుబాటులో ఉంది. మంగళవారాల్లో వందేభారత్ కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు విజయ్‌మోహన్, నరేశ్‌కుమార్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.







