అహ్మదాబాద్: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.
విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. విమాన పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. ఎయిర్ఇండియా B787 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘటన జరిగింది.
అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలోని ధార్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం విమానం నుంచి భారీ పొగలు రావడంతో అటు ఎయిర్ఇండియా, ఇటు ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు రన్‌వే 23 నుంచి బయలు దేరింది. కొద్ది సేపటి తర్వాత విమానం ఏటీసీకి అందుబాటులోకి రాలేదు. విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎయిర్‌పోర్టు సమీపంలోనే విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.
ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు, కేబిన్ లోని వీడియో
మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలిన విమానం- పలువురు విద్యార్థులు మృతి!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలింది. దీనితో పలువురు వైద్య విద్యార్థులు మరణించినట్లు, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే విమానం కూలినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు.

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై AAIB దర్యాప్తు
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ బోయింగ్ 787 విమానంలో 12 మంది సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
‘ఏఏఐబీ డెరెక్టర్ జనరల్, ఏజెన్సీలోని ఇన్వెస్టిగేషన్ డైరెక్టరర్ సహా ఇతర అధికారులు ఇప్పుడు అహ్మదాబాద్ బయలుదేరుతారు’ అని సదరు అధికారి తెలిపారు.
పౌర విమానయాన మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఏఏఐబీ – భారత గగనతలంలో ప్రయాణించే విమానాల భద్రతకు, అలాగే ఇండియన్ ఎయిర్ స్పేస్‌లో జరిగే విమాన ప్రమాదాలకు, తీవ్రమైన ఘటనలకు బాధ్యత వహిస్తుంది. వాటిపై సమగ్ర దర్యాప్తు చేస్తుంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను మెరుగుపరిచేందుకు తగిన చర్యలను సూచిస్తుంది.
‘విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు మాకు అందాయి. మరింత సమాచారం సేకరించడానికి మేము కృషి చేస్తున్నాం’ అని బోయింగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
‘మాటలకందని ఘోర విషాదం’- విమాన ప్రమాదంపై ముర్ము, మోదీ, రాహుల్, జగన్






