హల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టి మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్‌పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు వెల్లడించింది.
హల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారంతో రగిలిపోయిన భారత్- 25 నిమిషాల్లో 24 క్షిపణులతో దాడులు చేసి ఉగ్రవాద మూకల ఆటకట్టించింది. చెప్పినట్టే చేసి టెర్రిరిస్టులకే టెర్రర్ అంటే ఏంటో చూపించింది. బుధవారం తెల్లవారుజామున 1:05 గంటల నుంచి 1:30 గంటల వరకు 25 నిమిషాల పాటు ఆపరేషన్ జరగ్గా, 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడానికి 24 క్షిపణులను భారత్ ప్రయోగించింది. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన సంయుక్తంగా, పరస్పర సమన్వయంతో నిర్వహించాయి.
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి ముందు భారత త్రివిధ దళాలు పెద్ద కసరత్తే చేశాయి. తొలుత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ప్రధాన ఉగ్రవాద స్థావరాల లొకేషన్లను అత్యంత కచ్చితత్వంతో గుర్తించాయి. ఇందుకోసం భారత నిఘా వర్గాలు అందించిన సమాచారాన్ని వాడుకున్నాయి. పాక్, పీఓకేలోని ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్, రావల్ కోట్, చాక్స్వరి, భీంబేర్, నీలం వ్యాలీ, జీలం, చాక్వల్లలో ఉన్న నిర్దిష్ట ఉగ్రవాద స్థావరాలను టార్గెట్లుగా భారత్ ఎంచుకుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తైబా, జైషే మహ్మద్ గతంలో భారత్‌లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడ్డాయి. ఈ రెండు ఉగ్ర సంస్థలకు నిలయాలుగా, స్థావరాలుగా మారిన 9 నిర్దిష్ట ప్రాంతాలనే తమ లక్ష్యంగా భారత త్రివిధ దళాలు ఎంచుకున్నాయి. వీటిలో నాలుగు ఉగ్ర స్థావరాలు పాకిస్తాన్లో ఉండగా, మిగతా ఐదు ఉగ్ర స్థావరాలు పీఓకేలో ఉన్నాయి.
భారత్‌లో పలు ఏయిర్‌పోర్టులు మూసివేత!
అయితే దాడులు ఏయే ప్రాంతాల్లో చేశారనే విషయాన్ని ఇండియన్ ఆర్మీ వెల్లడించలేదు. మరోవైపు, దాడుల నేపథ్యంలో శ్రీనగర్, జమ్ము, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలు భారత్ మూసివేసినట్లు తెలుస్తోంది.
దాడులపై పాకిస్థాన్ ప్రధాని స్పందన
భారత్ దాడులు యుద్ధ చర్యలని పాకిస్థాన్ ప్రధాని షెహబాద్ షరీఫ్ అన్నారు. “మోసపూరిత శత్రువు పాక్‌లోని 5 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ చర్యలకు పాక్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాకిస్థాన్ సైన్యం వెంట దేశమంతా ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాక్, ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం” అని ఎక్స్‌లో అన్నారు.
దాడులు ధ్రువీకరించిన పాకిస్థాన్
పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై చేసిన దాడులను ఆ దేశం ధ్రువీకరించింది. దీనిపై పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ కూడా ఈ ఘటనపై స్పందించారు. పాకిస్థాన్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, 12 మందికి గాయాలైనట్టు పాక్ ఆర్మీ తెలిపింది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని చెప్పారు. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని ప్రగల్బాలు పలికారు.
బార్డర్లో టెన్షన్ టెన్షన్!
పాకిస్థాన్ ప్రధాని ప్రకటన తర్వాత ఎల్ఓసీ వెంబడి ఫూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడిందిత. దీంతో భారత్ సైన్యం కూడా దీటుగా కాల్పులు ప్రారంభించింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్ లష్కరే తోయిబాకు కేంద్రంగా ఉంది. ఇక పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్-ఎ- మహ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంది.
ఎక్కడికక్కడ అలర్ట్
భారత్ చేసిన మెరుపు దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ విమానాశ్రయాలను 48గంటల పాటు మూసివేసినట్లు సమాచారం.
బుధవారం ఉదయం 10.30 గంటలకు పాకిస్థాన్ ప్రధాని జాతీయ భద్రతా కమిటీతో భేటీ కానున్నారు.
మరోవైపు, దాడుల తర్వాత భారత్ కూడా అలర్ట్ అయింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా ఎన్ఎస్ఏ మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల వివరాలను ఆయనకు వివరించారు.
భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అలర్ట్ అయ్యాయి. పాక్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా నిలువరించేందుకు బార్డర్ వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఆర్మీ మోహరించింది.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబంలో 10మంది మృతి
భారత్ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబసభ్యులు హతం
10 మంది కుటుంబసభ్యులు, అనుచరులు మరణించినట్లు మసూద్ అజార్ వెల్లడి
భారత్ దాడుల్లో మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతని భార్య హతం







