పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి మరోసారి కాల్పుల కలకలం కొనసాగుతోంది. పాకిస్థాన్ సైన్యం వరుసగా తొమ్మిదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి మూడు సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో భారత సైన్యం పైకి కాల్పులు జరిపింది. దీనిని భారత్ సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
మే2-3 అర్ధరాత్రి జమ్ముకశ్మీర్‌లోని మూడు సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో పాకిస్థాన్ కాల్పులు జరిపింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ ఎదురుగా ఉన్న పాకిస్థాన్ ఆర్మీ పోస్టుల నుంచి కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. వీటికి భారత్ ఆర్మీ దళాలు వేగంగా స్పందించాయని ఓ అధికారి పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజూ పాక్ సైన్యం భారత దళాలపై ఎల్ఓసీ వెంబడి కాల్పులు జరుపుతున్నాయి. దీటుగా భారత్ ఆర్మీ బదులిస్తోంది.







