భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారీగా కాల్పులు జరుపుతోంది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు, ప్రజల ఇళ్లపై మోర్టార్లు, ఫిరంగులను ప్రయోగించింది. పాక్ కాల్పుల్లో సరిహద్దు గ్రామాలకు చెందిన 26 మంది ప్రాణాలు కోల్పోగా.. 42మంది గాయపడినట్లు పూంచ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) డాక్టర్ పర్వైజ్ అహ్మద్ ఈటీవీ భారత్‌కు వెల్లడించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెప్పారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. భారత్ ఎదురుదాడిలో పాకిస్థాన్ సైనిక పోస్టులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
భారత మెరుపు దాడులకు ఏం చేయాలో పాలుపోని పాకిస్థాన్ జమ్ముకశ్మీర్‌లో పెద్ద ఎత్తున కాల్పులకు జరుపుతోంది. మెర్టార్లు, ఫిరంగులతో సరిహద్దు గ్రామాలపై దాడులకు దిగింది. పాకిస్థాన్ రేంజర్లు రాత్రి నుంచి నిరంతరాయంగా జరుపుతున్న కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. అయితే పాక్ రేంజర్లు పూంచ్ జిల్లాలో భారత సరిహద్దు గ్రామాలను, ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. ఫలితంగా అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూంచ్‌తో పాటు రాజౌరి, కుప్వారా జిల్లాలోని యురి, కర్నాహ్, తంగ్దర్ సెక్టార్‌లలోనూ పాక్ భారీ ఎత్తున కాల్పులు జరుపుతోంది. పాక్ కాల్పులకు….. భారత సైన్యం ధీటుగా స్పందిస్తోంది. భారత్ భీకరకంగా ఎదురుకాల్పులకు దిగడంతో పాక్ వైపు ఆర్మీ పోస్టులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పొరుగుదేశంలో భారీగానే నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
విద్యా సంస్థల మూసివేత
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలోని ఐదు సరిహద్దు జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలనుమూసివేశారు. జమ్ము, సాంబ, కథువ, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో విద్యాసంస్థలు బుధవారం మూసివేస్తున్నట్లు డివిజినల్ కమిషనర్ రమేష్ కుమార్ చెప్పారు. పాకిస్థాన్ కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో ఇళ్లు, దుకాణాలు, అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. పాక్ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందుతున్నారు. మరికొంత మంది సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు.
పాకిస్థాన్ తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్ లోనూ అప్రమత్తత ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్ పూర్, పఠాన్ కోట్ , ఫజిల్కా, అమృత్ సర్ , గురుదాస్ పూర్ లో నేడు అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. పఠాన్ కోట్ జిల్లాలో 72 గంటల పాటు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
200కుపైగా విమానాలు రద్దు
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్ సహా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. శ్రీనగర్ విమానాశ్రయాన్ని భారత వాయుసేన ఆధీనంలోకి తీసుకుంది. లేహ్, జమ్ము, అమృత్‌సర్, పఠాన్‌కోట్, చండీగడ్, జోధ్‌పూర్, జైసల్మేర్, షిమ్లా, ధర్మశాల జామ్‌నగర్ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. భారత విమానయాన సంస్థలు దాదాపు 200కుపైగా విమానాలను రద్దు చేశాయి. ఒక్క ఇండిగోనే 165పైగా విమానాలను రద్దు చేసింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్…, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, కొన్ని విదేశీ విమానయాన సంస్థలు వేర్వేరు విమానాశ్రయాలకు తమ విమానాలను రద్దు చేశాయి.







