రాజధాని పునర్నిర్మాణ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ – వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ ,వికసిత్ ఆంధ్రపదేశ్‌ను నిజం చేస్తామన్న మోదీ.

ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దేశానికే మార్గదర్శకంగా అమరావతి రూపొందుతుందన్నారు. ఎన్టీఆర్ కలలుకన్న వికసిత్ ఆంధ్రపదేశ్‌ను ఆవిష్కరిస్తామన్నారు. అమరావతి రాజధానిలో చేసిన శంకుస్థాపనలు కేవలం కాంక్రీటు నిర్మాణాలు మాత్రమే కాదని దేశ ప్రగతికి కీలక పునాదులని వ్యాఖ్యానించారు. వెలగపూడి సభావేదికగా రాజధానిలో వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మళ్లీ ఏపీకి వస్తానని తెలిపారు.
ప్రజా రాజధానిగా అమరావతికి 2015లో శంకుస్థాపన చేశానని ప్రధాని గుర్తు చేశారు. గత పది సంవత్సరాల్లో రాజధానికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచిందని తెలిపారు. అమరావతి అభివృద్ధికి అన్నిరకాలుగా సహకరించిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక్కడ సచివాలయం, హైకోర్టు, శాసనసభ సహా అన్నిరకాల నిర్మాణాలకు తోడ్పాటు అందిస్తామని వివరించారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలని ఆకాక్షించారు. పవన్ కల్యాణ్ గారూ ఇది మనం చేయాలి మనమే చేయాలని ప్రధాని వ్యాఖ్యానించారు.
అమరావతి రాజధాని పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పలుమార్లు తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు చెప్పిన మోదీ పవిత్రమైన అమరావతి భూమిపై నిలబడి తాను కేవలం ఒక నగరాన్ని మాత్రమే చూడటం లేదని దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు ఒక చోదక శక్తిని చూస్తున్నానని చెప్పారు.
అమరావతి కేవలం నగరమే కాదు – ఐదు కోట్లమంది సెంటిమెంట్: సీఎం చంద్రబాబు

ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో నరేంద్ర మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయని చెప్పారు. మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు. గతంలో ప్రధానిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారన్నారు. వెలగపూడిలో ఏర్పాటు చేసిన అమరావతి పునర్నిర్మాణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఇటీవల మోదీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు వివరించారు. వందేమాతరం భారత్‌మాతాకి జై అంటూ సీఎం నినాదాలు చేశారు. ప్రజలతోనూ వందేమాతరం, భారత్‌మాతాకి జై అని చంద్రబాబు నినాదాలు చేయించారు.
రైతులు భూములే కాదు – రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారు: పవన్‌కల్యాణ్

ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రత్యేక గుర్తింపు ఉందని వచ్చే 50 రోజులు ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలని అన్నారు. ప్రపంచ రికార్డు సృష్టించేలా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా ఉండాలన్నారు. జూన్ 21న విశాఖకు వస్తానని మోదీ తెలిపారు.
పవన్ కు చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి ప్రధాని మోదీ చాక్లెట్ ఇచ్చారు. పవన్ ప్రసగించిన తర్వాత ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఈ క్రమంలోనే మోదీ ఆయణ్ని దగ్గరకి పిలిపించుకొని చాక్లెట్ అందజేసి అభినందించారు. ఇది చూసి పక్కనే ఉన్న వారు ముసిముసిగా నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.







